'పుష్ప' మాస్ ట్రీట్ రెడీ... రేపు ఉదయం 11:07 గంటలకు రిలీజ్

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 27, 2021, 07:50 PM

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''పుష్ప''. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ డ్రామాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా 'సామీ సామీ' అనే సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ విడుదల చేస్తున్నారు.


ప్రేక్షకులకు మాస్ ట్రీట్ అందించబోయే 'సామీ సామీ' పాటను రేపు (అక్టోబర్ 28) ఉదయం 11:07 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ పాట ప్రోమోని వదిలారు. 'నువ్ అమ్మీ అమ్మీ అంటాంటే.. నీ పెళ్లాన్నైపోయినట్టుందిరా సామీ.. నా సామీ' అంటూ రష్మిక మాస్ స్టెప్పులతో రచ్చ చేసింది. ముఖ్యంగా పుష్పరాజ్ కోసం శ్రీవల్లి పైట కొంగు జారేస్తూ వేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది.


అల్లు అర్జున్ - రష్మిక మందన్నా ఇద్దరూ డీ గ్లామర్ లుక్స్ లో కనిపిస్తున్నారు. పుష్పరాజ్ గురించి శ్రీవల్లి పాడుకునే ఈ పాట వెనక కథేమిటో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. చంద్రబోస్ సాహిత్యం అందించగా.. సింగర్ మౌనిక యాదవ్ ఈ గీతాన్ని ఆలపించారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన 'దాక్కో దాక్కో మేక' 'శ్రీవల్లి' సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. మరి 'సామీ సామీ' అంటూ వస్తున్న ఈ మాస్ నంబర్ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి..


కాగా మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ''పుష్ప'' సినిమాని నిర్మిస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చూసుకుంటున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు.
Recent Post