డబ్బులు, నగలతో ఉడాయించిన లవర్..పోలీసులకు వద్దకు నటి

  Written by : Suryaa Desk Updated: Tue, Dec 07, 2021, 03:54 PM

తమిళ బిగ్ బాస్ షో ద్వారా నటి మరియా జులియానా అలియాస్ జూలీ అమింజికరై ప్రేక్షకుల మన్ననలను సొంతం చేసుకుంది. తమిళనాడులో గతంలో జల్లికట్టు ఉద్యమంలో పాల్గొన్న ఆమె... అప్పట్లోనే బాగా పాప్యులర్ అయింది. బిగ్ బాస్ షో ద్వారా జనాలకు మరింత దగ్గరైంది. మరోవైపు తన ప్రియుడు తనను మోసం చేశాడంటూ తాజాగా చెన్నైలోని అన్నా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జులియానా ఫిర్యాదుపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... అన్నా నగర్ కు చెందిన మనీశ్ అనే యువకుడితో జులియానా ప్రేమలో ఉంది. గత నాలుగేళ్లుగా వీరు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇక్కడే సీన్ రివర్స్ అయింది. జులియానాకు మాయ మాటలు చెప్పి, ఆమె వద్ద ఉన్న డబ్బు, నగలు తీసుకుని మనీశ్ జంప్ అయ్యాడు. తన ప్రియుడి ఆచూకీని కనుక్కునేందుకు జులియానా కొన్ని రోజుల పాటు ప్రయత్నించింది. అయినా అతను ఎక్కడున్నాడనే ఆచూకీ దొరకలేదు. దీంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. తన ప్రియుడు తనను మోసం చేసి డబ్బులు, నగలు తీసుకుని పారిపోయాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జులియానా పేర్కొంది. అతన్ని పట్టుకుని, తన నగలను ఇప్పించాలని కోరింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మనీశ్ కోసం గాలింపు చేపట్టారు.
Recent Post