అమితాబ్‌ చిత్రంలో నాగార్జున?

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 10, 2018, 12:59 PM
 

అక్కినేని నాగార్జున చాలా కాలం తర్వాత హిందీ చిత్రంలో నటించబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. అమితాబ్‌ బచ్చన్‌, ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్రా’. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘బాహుబలి’ తరహాలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ఒకానొక సందర్భంలో రణ్‌బీర్‌ వెల్లడించారు.అయితే ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. చాలా కాలం తర్వాత నాగ్‌ హిందీ చిత్రంలో నటించాలని ఆశపడుతున్నారని, ‘బ్రహ్మాస్త్రా’ కథ నచ్చడంతో ఇందులో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈరోజు నుంచి ముంబయిలో జరగబోయే చిత్రీకరణలో అమితాబ్‌తో పాటు ఆయన కూడా పాల్గొంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే నిజమైతే నాగ్‌, అమితాబ్‌ను మరోసారి వెండితెరపై చూసే అవకాశం ఉంటుంది.


అమితాబ్ నటించిన ‘ఖుదా గవా’ చిత్రంతో పాటు ‘జఖమ్‌’, ‘అగ్ని వర్ష’, ‘ఎల్‌వోసీ కార్గిల్‌’ చిత్రాల్లో నాగార్జున నటించారు. నాగార్జున తన కుటుంబంతో కలిసి నటించిన ‘మనం’ చిత్రంలో అమితాబ్‌ అతిథి పాత్రలో కన్పించిన సంగతి తెలిసిందే.
Recent Post