కత్రినా కైఫ్‌కు చేదు అనుభవం

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 12, 2018, 05:02 PM
 

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సల్మాన్‌ ఖాన్‌ ప్రారంభించిన ‘దబాంగ్‌ టూర్‌’ లో భాగంగా కత్రినా, సోనాక్షి సిన్హా, డైసీ షా, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రస్తుతం వీరంతా కెనడాలోని వాంకోవర్‌లో పర్యటిస్తున్నారు.అక్కడ ఓ ప్రదర్శన అయిపోయిన తర్వాత కత్రినా హోటల్‌ రూంకు బయలుదేరుతుండగా..కొందరు అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. కానీ సుదీర్ఘ షెడ్యూల్స్‌తో కత్రినా అలసిపోయారు. దాంతో వారితో సెల్ఫీలు దిగే ఓపిక లేక తన కారు వైపునకు వెళుతుండగా ఓ యువతి ‘మాకు నీ ఫొటోలు వద్దు’ అని కామెంట్‌ చేసింది.


అది విని కత్రినాకు కోపం వచ్చింది. కానీ ఆమె శాంతంగా స్పందించాలని అనుకున్నారు. తనపై కామెంట్స్‌ చేసిన యువతిని ఉద్దేశిస్తూ..‘మీరు ఇలా చెడుగా ప్రవర్తించకూడదు. ప్రదర్శన ముగిశాక మేం చాలా అలసిపోయాం. అది మీరు అర్థం చేసుకోవాలి.’ అని మందలించారు. ఇందుకు ఆ యువతి ప్రతి స్పందిస్తూ.. ‘నీకు నువ్వు నటిగా చెప్పుకొంటావ్‌. నిన్ను ఆరాధించే అభిమానుల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలుసుకో’ అని జవాబిచ్చింది. అప్పటికీ కత్రినా కోపగించుకోకుండా ‘దయచేసి శాంతించండి’ అని చెప్పి తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులతో సెల్ఫీ దిగడానికి ఒప్పుకొన్నారు.


కానీ ఆ యువతి మాత్రం తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయింది. కత్రినా తన అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగుతుంటే..‘మేం సల్మాన్‌ కోసం ఎదురుచూస్తున్నాం. కేవలం సల్మాన్‌ కోసమే..’ అని కేకలు వేసింది. కానీ కత్రినా మాత్రం ఆమెను పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఈ తతంగాన్ని అక్కడున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.
Recent Post