ఇక్కడ పవన్ కళ్యాణ్.. అక్కడ శింబు

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 14, 2018, 03:03 PM

ఐదేళ్ల కిందట ఇదే సమయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టించాడు. పవర్ స్టార్ సినిమా ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ రికార్డుల్ని బద్దలు కొడుతూ  తిరుగులేని విజయాన్నందుకుంది. ఏకంగా రూ.80 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిందా చిత్రం. ఈ చిత్రాన్ని కన్నడ.. బెంగాలీ భాషల్లో రీమేక్ చేశారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తమిళంలోకి ఈ సినిమా వెళ్తుండటం విశేషం.కోలీవుడ్ స్టార్ హీరో శింబు కథానాయకుడిగా సీనియర్ దర్శకుడు సుందర్.సి ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. ‘2.0’ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తోంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ చిత్రంలో సుందర్ భార్య ఖుష్బు అత్త పాత్రలో నటిస్తుందట. తెలుగులో ఆ పాత్రను నదియా చేసిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నటీనటుల ఎంపిక మీద దృష్టిపెట్టాడు సుందర్.


నిజానికి సుందర్ ఈ సమయంలో ‘సంఘమిత్ర’ను సెట్స్ మీదికి తీసుకెళ్లాల్సింది. ‘బాహుబలి’ తరహాలో రూ.300 కోట్లతో తెరకెక్కించాలనుకున్న ఆ చిత్రం అనివార్య కారణాలతో ఆగిపోయింది. దీంతో సుందర్ ‘అత్తారింటికి దారేది’ రీమేక్ మీదికి మళ్లాడు. శింబుకు తెలుగు సినిమాల రీమేకుల్లో నటించడం కొత్తేమీ కాదు. ‘ఇడియట్’.. ‘వేదం’ తమిళ వెర్షన్లలో అతను నటించాడు. ఆ రెండూ ఓ మోస్తరుగా ఆడాయి. మరి ‘అత్తారింటికి దారేది’ రీమేక్ అతడికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. అతను తమిళంలో మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో చేసిన సినిమా వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Recent Post