ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో మేం బొమ్మ‌ల‌మే

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 07, 2018, 11:18 AM



మజ్ను చిత్రంతో తెలుగు తెరకొచ్చిన బ్యూటీ అనూ ఇమ్మాన్యూయేల్‌. ఆక్సీజన్‌, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య చిత్రాలతో నాయికగా గుర్తింపు తెచ్చుకుంది. నాగచైతన్య సరసన ఆమె నటిస్తున్న తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. మారుతి దర్శకత్వంలో హారికా హాసినీ క్రియేషన్స్‌ సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రమ్యకృష్ణ అత్త పాత్రలో కనిపించబోతోంది. ఈ నె 13న శైలజా రెడ్డి అల్లుడు సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాయిక అనూ ఇమ్మాన్యూయేల్‌ చిత్రంలో నటించిన తన అనుభవాలను తెలిపింది. ఆమె మాట్లాడుతూ…ఏ సినిమా అయినా కథ నచ్చాకే అంగీకరిస్తాను. ఒక్క అజ్ఞాతవాసి మాత్రమే పవర్‌స్టార్‌ ఉన్నాడని నటించాను. త్రివిక్రమ్‌ పవన్‌ కాంబినేషన్‌ సినిమా వస్తే వద్దని ఎలా అంటాను. అయితే అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీతలా నా పాత్ర ఉండదు కదా అని అడిగాను. ఇద్దరు నాయికలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని మాటిచ్చారు. శైలజా రెడ్డి అల్లుడు, గీత గోవిందం, నా పేరు సూర్య ఈ మూడు సినిమా ఒకేసారి నా దగ్గరకు వచ్చాయి. 


 


గీత గోవిందం కథ నచ్చినా ఆ సినిమా చేయలేకపోయాను. అప్పటికి అర్జున్‌ రెడ్డి విడుదలవలేదు. ఈ సినిమాలో ఈగో ఉన్న అమ్మాయిలా కనిపిస్తాను. కోపమెక్కువ. నిజంగా వ్యక్తిగత జీవితంలోనూ నాకు కోపం ఎక్కువగా వస్తుంది. ఎవరితోనూ అంత సులువుగా కలవలేను. కానీ ఒకసారి స్నేహం చేస్తే వదలిపెట్టకుండా ఉంటాను. నాకు కోపమొస్తుంది కానీ నా చుట్టూ ఉండేవాళ్లు, తెలిసినవాళ్లనే కోప్పడతాం. మీపై (పాత్రికేయులపై) కోపం చూపించలేను కదా. నాగ చైతన్యతో నటించడం బాగుంది. చాలా మంచి వ్యక్తి. సహ నటుడిగా చాలా సౌకర్యంగా అనిపించింది. దర్శకుడు మారుతితో పనిచేయడం కూడా గొప్ప అనుభూతినిచ్చింది. సినిమా రూపకల్పన మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఆయన. రమ్యకృష్ణ గారితో నటించేప్పుడు భయమేసింది. మేమిద్దరం కలిసి నటించాల్సిన సన్నివేశాల్లో భయంతో నాకు సంభాషణలు రాకపోయేవి. శైలజా రెడ్డి అల్లుడు అన్ని విధాలా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇందులో వినోదం, కుటుంబ విలువలు, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఇక నాయికగా నేను అన్ని భాషల్లో పేరు తెచ్చుకోవాలి అని ఆరాటపడటం లేదు. ఏదో ఒక భాషలో పేరు తెచ్చుకుంటే చాలు మిగతా వాళ్లు గౌరవిస్తారు. నేను తెలుగులో అగ్ర నాయికగా ఉండి తమిళ చిత్రాలు చేస్తే అక్కడ విలువిస్తారు. అలా కాకుండా ఇక్కడా అక్కడా సరైన గుర్తింపు రాకుంటే ఎక్కడా నా స్థాయి పెరగదు.


 


 అందుకే కొన్ని తమిళ చిత్రాలు వస్తున్నా వాటిని అంగీకరించడం లేదు. డేట్స్‌ కుదరకే గీత గోవిందం సినిమా వదలుకున్నాను. కథ బాగుండటం తప్ప అప్పటికీ ఏ అంశంలో చూసినా నా పేరు సూర్య, శైలజారెడ్డి ఆసక్తి కలిగించాయి. నా సినిమాలు కొన్ని ఆలస్యంగా విడుదలయ్యాయి. ఇదీ ఓ రకంగా నాకు మంచే చేసింది. ఆక్సీజన్‌ సినిమా ముందే విడుదలై ఉంటే నాకు అజ్ఞాతవాసి, నా పేరు సూర్య లాంటి చిత్రాలు వచ్చేవి కావు. ఒక సినిమా జయాపజయాలను నేను నియత్రించలేను. ప్రతి సినిమాకూ నటిగా ఎదగాలని మాత్రమే ఆలోచిస్తాను. సినిమా అనేది ఉమ్మడి ప్రయత్నం. ఇక్కడ ఏ ఒక్కరూ ఏదీ సాధించలేరు. సినిమాల ఎంపికలో పూర్తి బాధ్యత నాదే ఉంటుంది. ఒక మంచి సినిమా చాలు నాయికలుగా మా జీవితాలు మారిపోవడానికి. మహానటి చిత్రం కీర్తి సురేష్‌ జీవితంలో గొప్ప జ్ఞాపకంలా మిగిలిపోతుంది. అలాంటి కథలు వచ్చినప్పుడే మేము నటీమణులుగా ప్రతిభ చూపించగలుగుతాం. వాణిజ్య విలువలున్న చిత్రాల్లో బొమ్మల్లాగే కనిపించాలి. ఎంతైనా సినిమా అనేది ఓ కల్పన. హైదరాబాద్‌లో అద్దె ఇళ్లు తీసుకున్నాను. నేను నాయికగా మరో మూడేళ్లు ఉంటానేమో. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోతా. అందుకే ఇక్కడ సొంత ఇళ్లు తీసుకోలేదు. అని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com