ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా కోసం ఎంత క‌ష్ట‌మైనా సిద్ధ‌మే : స‌మంత‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 12, 2018, 11:24 AM



నేను నటించిన సినిమాలో నాకు మంచి పేరొస్తే చాలునని అనుకోను. సినిమాకు డబ్బులు పెట్టిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నప్పుడే ఆ సినిమా హిట్‌ అని భావిస్తాను. నా మటుకు బాక్సాఫీసు లెక్కలే సినిమా విజయానికి ముఖ్యమని భావిస్తాను అని కథానాయిక సమంత చెప్పుకొచ్చారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన యూ టర్న్‌ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సమంత చిత్రం గురించి, తన కెరీర్‌ గురించి కొద్దిసేపు ముచ్చటించారు. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే…


మాతృక కంటే మరింత ఆసక్తిగా…


నేను దర్శకుడు పవన్‌కుమార్‌కి లూసియా టైమ్‌ నుంచి పెద్ద అభిమానిని. అతని సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా కన్నడ ట్రైలర్‌ విడుదల కాగానే నేనే ఫోన్‌ చేసి స్క్రిప్టు పంపమన్నాను. స్క్రిప్ట్‌ విపరీతంగా నచ్చడంతో వెంటనే రీమేక్‌ చేద్దామని అనుకున్నాను కానీ అప్పటికే నేను ఒప్పుకున్న సినిమాల డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో రూపొందడానికి ఇంతకాలం పట్టింది. ఇక ఈ చిత్రం మాతృకతో పోల్చుకుంటే కొన్ని మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. సినిమా స్థాయిని పెంచడం కోసం ఇంకాస్త ఎక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం తప్ప ఎక్కడా ఒరిజనల్‌ ఫీల్‌ను పోనివ్వలేదు. ఈ చిత్రాన్ని చూసిన కొందరు మాతృక కంటే మరింత ఆసక్తికరంగా ఉందని చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. క్లైమాక్స్‌ మాత్రం మన నేటివిటీ, ఆలోచనకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాం తప్ప ఫీల్‌ను మాత్రం ఎక్కడా పోగొట్టలేదు.


ఒరిజనల్‌ సామ్‌ను చూశామంటున్నారు


స్వతహాగా నేను చాలా మంచి డ్యాన్సర్‌ని. స్కూల్‌, కాలేజ్‌ టైమ్‌లో ప్రతీ వేడుకలో డ్యాన్స్‌ బాగా చేసేదాన్ని. కానీ సినిమాల్లోకి వచ్చాక నా డ్యాన్స్‌ ప్రావీణ్యం చూపించడానికి మాత్రం అవకాశం రాలేదు. అయితే మొదటిసారిగా ఈ సినిమా కోసం చేసిన ది కర్మ థీమ్‌ సాంగ్‌లో నన్ను చూసిన నా ఫ్రెండ్స్‌ అంతా ఇప్పటికి ఒరిజనల్‌ సామ్‌ను చూశామని సంతోషంగా అంటున్నారు.


ఇంకా ఛాలెంజింగ్‌ పాత్రలు చేయాలనుంది


ఇప్పటివరకు నేను పోషించిన పాత్రలన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిత్రంలో నేను నటించిన జర్నలిస్ట్‌ పాత్ర ఒక ఎత్తు. ఇకపై కమర్షియల్‌ హీరోయిన్‌ పాత్రలతో పాటు ఇంకాస్త కష్టంగా ఉండే పాత్రలతో పాటు ప్రయోగాత్మక ఛాలెంజింగ్‌ పాత్రలు చేయాలనుంది. నా అదృష్టం బావుండి ఆ తరహా పాత్రలే ఎక్కువ వస్తున్నాయి. నేను లగ్జరీస్‌ను ఎప్పుడూ కోరుకోలేదు. సినిమా కోసం ఎంత కష్టపడడానికైనా నేను సిద్ధమే. ఈ చిత్రం షూటింగ్‌ నా కెరీర్‌లో చాలా మంచి అనుభవం. రోడ్లమీద, అలాగే ఆటోల్లో కూడా ఈ చిత్రం చిత్రీకరణ జరిపాం.


ఈ ఏడాది చాలా రిస్క్‌ చేశాను


రంగస్థలం సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించడం చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఎందుకంటే అంతకుముందు వరకు నేను కనీసం ఏ విలేజ్‌కి కూడా వెళ్లలేదు. ఆ తర్వాత అభిమన్యుడు సినిమా కోసం ఓ కొత్త దర్శకుడితో కలిసి పనిచేశాను. మహానటి చిత్రం కూడా ఒక రిస్కే. ఇక ఈ రీమేక్‌ చిత్రమైతే నా కెరీర్‌లోనే పెద్ద రిస్క్‌. స్టార్‌ హీరోలు లేకుండా కేవలం కథను నమ్మి నటించిన చిత్రమిది. ఇలా ఈ ఏడాది చాలా రిస్క్‌ చేశాను.


ఇకపై డబ్బింగ్‌ చెప్పుకుంటా


నటిగా నిరూపించుకున్నాను. కానీ ప్రేక్షకులకు కొత్తగా ఏం ఇస్తున్నాను అని అనుక్షణం ఆలోచిస్తుంటాను. అందుకే రంగస్థలం, మహానటి చిత్రాల్లో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. ఇకపై నా సినిమాలకు నేనే డబ్బింగ్‌ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. దానివల్ల పాత్రకు సహజ‌త్వం రావడంతో పాటు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతుంది.


అదే పెళ్లిరోజు బహుమతి


అక్టోబర్‌ 6వ తారీఖు నా మొదటి పెళ్లి వార్షికోత్సవం. దీని ప్రత్యేక ఏంటంటే…నేను, నాగచైతన్య కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్‌ను ఆ రోజే మొదలుపెడుతున్నాం. అదే నా పెళ్లిరోజు బహుమతిగా అనుకుంటున్నా.


పెళ్లి తర్వాత మరింత సేఫ్టీ


పెళ్లైన తర్వాత ఎక్కువ సినిమాలు చేస్తున్నారేంటి? అని అందరూ ప్రశ్నిస్తున్నారు. నాకు భార్య స్థానం సంపాదించుకున్నాక ఎక్కువ సేఫ్టీ ఫీలవుతున్నాను. నాకు అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్‌ ఉంది. ఆ సపోర్ట్‌తోనే ఎక్కవ సినిమాలు చేయగలుగుతున్నాను. ఇప్పటివరకూ ఇంట్లో నేను ఒక్కసారి కూడా వంట చేయలేదు. అలాగే మా సినిమాల వర్క్‌ గురించి ఇంట్లో అస్సలు చర్చించం.


చైతూ చిత్రాన్ని చూశాను


చైతూ నటించిన శైలాజారెడ్డి అల్లుడు చిత్రాన్ని ఇటీవల చూశాను. పండగరోజు వస్తున్న పండుగ లాంటి చక్కటి వినోదాత్మక చిత్రమిది అంటూ ముగించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com