ఇక్క‌డ అదృష్టం కూడా క‌ల‌సి రావాలి

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 19, 2018, 12:56 PM

వైజయంతీ మూవీస్‌ బేనర్‌పై పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను తీస్తూనే ఉన్నాం. చిన్న సినిమాలను ఎప్పుడూ వదిలి పెట్టలేదు. 1974లో ఓ సీత కథ అనే చిన్న చిత్రంతోనే మా సంస్థ ప్రయాణం ఆరంభమైంది అని సీనియర్‌ నిర్మాత సి.అశ్వనీదత్‌ పేర్కొన్నారు. ఎన్‌.టి.రామారావు, అక్కినేని, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలతో పెద్ద సినిమాలను తీసిన వైజయంతీ సంస్థ అనేక చిన్న చిత్రాలను కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. పలు మల్టి స్టారర్‌ చిత్రాలు కూడా ఈ సంస్థ నుంచి వచ్చాయి కూడా.


తాజాగా నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ నిర్మించిన దేవదాస్‌ చిత్రం ఈ నెలాఖరులో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో సి.అశ్వనీదత్‌ కొద్దిసేపు పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ వివరాలేమిటో ఆయన మాటల్లో…మేము వైజయంతీ సంస్థను ప్రారంభించిన ఈ 45 ఏళ్లలో దేవదాస్‌ 52వ సినిమా. 1973లో నేను చెన్నైకి తీసుకుని వచ్చిన డబ్బును వేరేరకంగా పెట్టుబడులు పెడితే కోట్లకు కోట్లు సంపాదించవచ్చు. కానీ బ్యాలెన్స్‌ షీట్‌ చూసుకోకుండా ఆలోచిస్తే… నేనెంతో ఇష్టపడి వచ్చిన ఈరంగం నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని చెప్పగలను. నా దృష్టిలో సినిమారంగంలో పోగొట్టుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. టాలెంట్‌ ఒక్కటే ఇక్కడ సరిపోదు. అదృష్టం కూడా కలిసిరావాలి. ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని సినిమాలు నన్ను ఆర్థికంగా ఇబ్బందిపెట్టిన సందర్భాలలో ఇంకా ఏం సినిమాలు తీస్తామని అనుకున్న సందర్భాలు లేకపోలేదు. అప్పుడు నా సతీమణి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. మీరు కాకపోతే ఎవరు తీస్తారు మంచి సినిమాలు అని అంటూ ఆమె వెన్నుదట్టడం నాకు మళ్లిd చిత్ర నిర్మాణాన్ని కొనసాగించేందుకు కారణమైంది. ఇప్పటివరకు తాతలతో, తండ్రులతో, మనవళ్లతో సినిమాలను తీశాను. వందేళ్ల వరకు వైజయంతీ ప్రయాణం ఇలానే కొనసాగుతూనే ఉంటుంది. నేను 45 ఏళ్ల పాటు ఈ సంస్థను కొనసాగించాను. మా అమ్మాయిలు స్వప్న, ప్రియాంకలు సక్సెస్‌ఫుల్‌గా సినిమాలను చేస్తున్నారు. మిగతా కాలాన్ని వారు కొనసాగిస్తారు. ఈ బేనర్‌ను మరింత ముందుకు తీసుకుపోవాలన్న కోరిక వారికి ఉంది. హిందీ, తమిళ భాషలలో కూడా సినిమాలను చేసేందుకు వారు పూనుకుంటున్నారు. ఇక నాగార్జునతో మా బేనర్‌లో ఇది ఐదో సినిమా.


ఈరోజు వస్తున్న యంగ్‌ డైరెక్టర్స్‌లో చాలామంది మంచి సినిమాలు తీస్తున్నారు. నాగ్‌అశ్విన్‌లానే శ్రీరామ్‌ఆదిత్య కూడా మంచి దర్శకుడు. స్నేహం విలువ గురించి. ఇద్దరు విభిన్నమైన వ్యక్తులు కలిసి చేసే ప్రయాణం ఎలా ఉంటుందన్న అంశంతో దేవదాస్‌ చిత్రం తెరకెక్కింది. మా బేనర్‌లో మణిశర్మకు పదిహేడవ సినిమా. సంగీతపరంగా మణి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. అక్కినేని బర్త్‌ డే సందర్భంగా ఆడియోను హైదరాబాద్‌లో విడుదల చేయబోతున్నాం. గుండమ్మకథ చిత్రంలా రెండున్నర గంటల పాటు చక్కటి వినోదాన్ని పంచే చిత్రమిది. సగటు ప్రేక్షకుడ్ని చాలాబాగా ఆనందపరుస్తుంది. భలే మంచిరోజు, శమంతకమణి చిత్రాలను రూపొందించిన శ్రీరామ్‌ఆదిత్యను ఈ చిత్రానికి నాగార్జున, నాని కలిసి ఎంపిక చేశారు. ప్రతిష్టాత్మకంగా మేము నిర్మించిన మహానటికి పెద్ద ఆదరణ లభించింది. మేము తదుపరి రెండు చిత్రాలను విజయ్‌ దేవరకొండతో, ఒక సినిమాను ఎన్టీఆర్‌తో తీయబోతున్నాం. ఇక ఎన్నికల్లో నేను పోటీ చేయదలచుకోలేదు. తెలుగుదేశం పార్టీ పబ్లిసిిటీ చేయాలనుకుంటున్నాను. చంద్రబాబునాయు డుగారు చేస్తున్న మంచిని ప్రజల్లోకి ఏలా తీసుకెళ్లాలన్న ఆలోచనతో ముందుకెళ్తాను అంటూ ముగించారు.
Recent Post