ఒక్కసారి ఏదైనా పాత్ర చేయాలని కమిట్ అయితే…దాని గురించి ఎన్ని విమర్శలు వచ్చినా నేను భయపడను, ఎంతమాత్రం వెనక్కి తగ్గను అని కథానాయిక ఆండ్రియా స్పష్టం చేసింది. తమిళ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన ఆమె వడచెన్నైలో చేసిన పాత్రను సాహసంతో కూడినదిగా అభివర్ణిస్తున్నారు. చాలామంది హీరోయిన్లు మాదిరిగానే ఆండ్రియా కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతోంది. మద్యం అలవాటు, అలాగే పలు నెగటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయి పాత్రలో నటించడానికి అంగీకరించడానికి ముందు విమర్శలు వెల్లువెత్తుతాయన్న భయం మీకు వేయలేదా? అన్న ప్రశ్నకు ఆండ్రియా స్పందిస్తూ…ఏదైనా పాత్ర నాకు నచ్చితే…ఇంక ఎవరు ఏమనుకున్నా బాధలేదు, భయం లేదు. ఇక విమర్శలు వచ్చినా వాటి గురించి అస్సలు ఆలోచించను.
ఓ నటిగా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలనన్న పేరు రావాలంటే విమర్శలను పట్టించుకోకూడదు. అలాగే ఇమేజ్ గురించి ఆలోచిస్తూ ఆ చట్రంలోనే ఉండిపోకూడదన్నది నా భావన. ఇక మీటూ గురించి ఆండ్రియా మాట్లాడుతూ, ఇప్పుడిప్పుడే మహిళలకు తమకు ఎదురైన వంచన, మోసాలను చెప్పే ధైర్యం కలుగుతోంది. అలా బయట ప్రపంచానికి చెప్పడం మంచిదే. అయితే ఇందులో పదిమంది చెప్పిన ఘటనలలో ఇద్దరు, ముగ్గురు చెప్పిన వాటిల్లోనే నిజం ఉంటుంది అని పేర్కొన్నారు