ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొదటి ప్రపోజ్ గురించి చెప్పిన కుష్బూ

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 10, 2018, 11:34 AM



వివాదంతో ఆమె పేరు సహజీవనం చేస్తూ ఉంటుంది. తాను పెదవి విప్పితే గొడవ అవుతుందని తెలిసినా వెనక్కి తగ్గే రకం కాదామె. బయటకు చర్చించటానికి సైతం ఇష్టపడని అంశాల మీదా ఓపెన్ గా మాట్లాడే దమ్ము.. ధైర్యం ఆమె సొంతం. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. ఒకప్పటి అందాల భామ.. ఇప్పుడు హుందా పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కుష్బూ సుందర్.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆమె.. ఒక మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన భర్త సుందర్ చేసిన ప్రపోజల్ గురించిన ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. సుందర్ దర్శకత్వంలో తాను తొలి సినిమా తీస్తున్నప్పుడు.. తాను అప్పటికే పెద్ద హీరోయిన్ నని.. మేడం ఈ షాట్ ఉంది.. ఆ షాట్ ఉందంటూ చెప్పేవారన్నారు. 


"ఒక రోజు మాట్లాడుతూ.. నీకు నాకు పిల్లలు పుడితే నీలా ఉంటారా?  నాలా ఉంటారా? అని అడిగారు. ఒక్కసారిగా నేను షాక్ తిన్నా. ఎక్స్ క్యూజ్ మి.. మీరేం అడుగుతున్నారు?  నాకు ప్రపోజ్ చేయాలని చూస్తున్నారా? అని అడిగా. అప్పుడు తను ఓ.. అదంతా చేయాలా?  నాకు తెలీదు.. సరే.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అని అడిగారు. అప్పటికి అతను తన మొదటి సినిమా చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ 20 రోజులకే ప్రపోజ్ చేశాడు. అతని నిజాయితీ నచ్చింది. అందుకే వెంటనే ఓకే చెప్పేశా. మరో కారణం ఏమంటే.. అతను లవ్ గురించి మాట్లాడలేదు.. ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. అది నచ్చింది" అంటూ తనకు చేసిన ప్రపోజ్ గురించి వెల్లడించారు. 


తన భర్త తనకు చేసిన మొదటి ప్రపోజ్ గురించి చెప్పిన కుష్బూ.. మరో ఆసక్తికర అంశాన్ని చెప్పారు. తనకిప్పుడు 48 ఏళ్లు అని.. అయితే ఇప్పటికి తనకు ప్రపోజల్స్  వస్తూనే ఉంటాయన్నారు. అలా వచ్చినప్పుడు మా ఆయన్ని అడిగి చెబుతానని అంటుంటాని నవ్వేశారు. తమకు ఇద్దరు పిల్లలని.. పెద్ద పా తనలా ఉంటుందని.. చిన్నపాప మాత్రం అచ్చం వాళ్ల నాన్న జిరాక్స్ లా ఉంటుందన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com