ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భైరవ గీత మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 13, 2018, 04:54 PM



రంగస్థలం, RX 100 సినిమాల తర్వాత గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రాలకు డిమాండ్ పెరిగింది. నేటివిటి సినిమాలకు క్రేజ్ పెరుగడంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ దృష్టి వాటిపై పడింది. ఆర్జీవి స్కూల్ నుంచి సిద్ధార్థ అనే యువ దర్శకుడు తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతూ రూపొందించిన చిత్రం భైరవగీత. రిలీజ్‌కు ముందు టీజర్లకు, ట్రైలర్లకు, ఆడియోకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో భైవర గీత డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా వర్మ అభిమానులను సంతృప్తి పరిచిందా? యువ దర్శకుడి పనితీరు ప్రేక్షకులను మెప్పించిందా? హీరో, హీరోయిన్లుగా నటించిన ధనుంజయ్, ఇరా ఆకట్టుకొన్నారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


స్టోరి : రాయలసీమలో భూస్వామి సుబ్బారెడ్డి (బాలరాజ్‌వాడీ) వద్ద భైరవ పనిచేస్తుంటాడు. సుబ్బారెడ్డి కూతురు గీత (ఇరా మోర్)ను తొలి చూపులోనే ఇష్టపడుతాడు. ఒకానొక సమయంలో ప్రాణాలను తెగించి ప్రత్యర్థి దాడుల నుంచి గీతను కాపాడటంతో భైరవ అంటే ఇష్టం కలుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో కట్టారెడ్డి (విజయ్ రామ్) అనే ఫ్యాక్షన్ నేతతో గీతకు నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థ కార్యక్రమంలో కాబోయే భర్తను గీత చెంపపై కొట్టడం, ఆ తర్వాత తండ్రి సుబ్బారెడ్డితో గొడవ పడి భైరవను పెళ్లి చేసుకొంటానని తెగేసి చెబుతుంది.


 


భైరవ గీత మూవీ ట్విస్టులు తన కూతుర్ని బుట్టలో వేసుకొన్న భైరవను అంతమొందించడానికి ప్లాన్ చేస్తాడు. ఆ క్రమంలో భైరవ, గీత పారిపోతారు. పారిపోయిన భైరవ, గీత‌లకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? భైరవ నుంచి సుబ్బారెడ్డికి ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. బానిస బతుకు నుంచి విముక్తి కావడానికి భైరవ ఎలాంటి పోరాటం చేశాడు. సుబ్బారెడ్డి, కేశవరెడ్డి, (భాస్కర్ మన్యం), కట్టారెడ్డి ఆగడాలకు ఎలా ముగింపు పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే భైరవ గీత.


 


ఫస్టాఫ్‌లో  :  పక్కా గ్రామీణ, ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం భైరవ గీత. భూస్వామ్య, పెత్తందారి వ్యవస్థ, ఫ్యాక్షన్ రాజకీయాల్లో కనిపించే అంశాలను హైలెట్ చేస్తూ కథ మొదలవుతుంది. ఉన్నత చదువులకు వెళ్లిన గీత ఊర్లోకి రావడం, ఆమెను చూసి భైరవ ఇష్టపడటం లాంటి అంశాలతో రొటీన్‌గా మారుతాయి. కాకపోతే ఇంటెన్సివ్ టేకింగ్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ఊరు చూడటానికి వెళ్లిన గీతను సుబ్బారెడ్డి ప్రత్యర్థులు దాడి చేసే అంశం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. గీతపై దాడి తర్వాత తన వద్ద పనిచేసే వ్యక్తి (పులి లక్ష్మణ్)ను సజీవంగా దహనం చేసే సీన్ నేచురల్‌గా ఉంటుంది. ఇక తొలిభాగంలో నల్లోడు (దయానంద్) పాత్రను మలిచిన తీరు ఆకట్టుకొంటుంది. ఓ భారీ ఛేజింగ్‌, ఆసక్తికరమైన సన్నివేశంతో తొలి భాగం ముగుస్తుంది.


 


ఇక సెకండాఫ్‌లో సుబ్బారెడ్డి, భైరవకు మధ్య దాడులు, ప్రతీదాడుల అంశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. సుబ్బారెడ్డిపై తిరుగుబాటు చేయడానికి భైరవ ఊరి ప్రజలను ఏకం చేయడం లాంటి సీన్లు 80వ దశకంలోని బీరం మస్తాన్ రావు, మాదాల రంగారావు సినిమాలను గుర్తు తెస్తాయి. మితీమీరిన హింస, జుగుప్సకరమైన కొన్ని సన్నివేశాలు ఒళ్లు జలదరించేలా ఉంటాయి. భూస్వాములపై అణగదొక్కబడిన ప్రజలు ప్రతీకారం తీర్చుకోవడంతో కథ ముగుస్తుంది.


 


భైరవ పాత్రలో ధనుంజయ్ చక్కగా నటించాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో తడబాటు కనిపించింది. పట్టి పట్టి డైలాగ్‌లు చెప్పించడం కొంత డిస్ట్రబ్‌గా అనిపిస్తుంది. ఇరాతో కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాలేదు. సున్నితమైన ప్రేమ సన్నివేశాలు లేకపోవడం మరీ నాటుగా అనిపించింది. తల్లి హత్యకు గురయ్యే ఎపిసోడ్‌లో నటన బాగుంది. తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు.గీతగా ఇరా మోర్ అందంతో ఆకట్టుకొన్నది. లిప్‌లాక్ లాంటి బోల్డు సీన్ల జంకు లేకుండా నటించింది. కొంత యాక్షన్ సీన్లు చేసే అవకాశాన్ని బాగానే ఉపయోగించుకొన్నది. కథలో ఫ్యాక్షన్ మోతాడు ఎక్కువ కావడంతో గ్లామర్ పండించడానికి పెద్దగా స్కోప్ లేకపోయింది. ఇరా స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఒకట్రెండు పాటల్లో హాట్‌హాట్‌గా కనిపించింది.ఫ్యాక్షన్ గ్రూపుల్లో దయానంద్, పులి లక్ష్మణ్ పాత్రలు ఎలివేట్ అయ్యాయి. RX 100 తర్వాత దయానంద్‌కు మంచి పాత్ర దొరికింది. తనకు లభించిన అవకాశాన్ని నూటికి నూరుపాళ్లు దయానంద్ న్యాయం చేశాడు. మిగితా పాత్రల్లో చిన్న నటులు బాగా ఆకట్టుకొన్నారు.


మూవీ రివ్యూ  : 3/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com