గోవా సుందరి ఇలియానా (31) మళ్లి గందరగోళంలో పడింది. తెలుగులో మంచి అవకాశాలు వదులుకుని బాలీవుడ్‌పై దృష్టి నిలిపింది. హిందీ సినిమాల్లో ఓ వెలుగు వెలగాలని తహతహలాడింది. కానీ ఆమె లెక్క తప్పింది. హిందీ సినిమా నిరాశపరిచింది. నమ్ముకున్న తెలుగు సినిమా దూరమైంది. తమిళంలో అవకాశాలు ఉత్సాహం కలిగించలేదు. దాంతో మళ్లిd టాలీవుడ్‌పైనే దృష్టి నిలపాలని భావించింది. ఒకప్పటి హిట్ పెయిర్ రవితేజ, ఇలియానా కలిసి కిక్ అనే సినిమా చేశారు. ఈ సినిమా విజయం ఇద్దరికీ కలిసి వచ్చింది. ప్రస్తుతం రవితేజ ఫ్లాప్‌ల పరంపరలో ఉన్నాడు. ఇలియానాకు సినిమాలు కావాలి.
సరిగ్గా ఈ అవకాశం ఇద్దరినీ కలిపింది. కలిసి అమర్ అక్బర్ అంటోనిలో కలిసి నటించారు. కానీ సెంటిమెంట్ వర్కవుట్ అవలేదు. రివర్స్ అయింది. దాంతో అ అ ఆ బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేసింది. ఇలియానా రీ ఎంట్రీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కించిత్ కర్తవ్యం అని ఇలియానా ఆలోచిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్లో అనేక మంచి హీరోయిన్లు ఉన్నారు. కొందరికి హిట్స్ ఉన్న సినిమాల్లేవు. ఈ పరిస్థితిలో ఇలియానాను పిలిచి వేషాలిచ్చే పరిస్థితి లేదు అని సినీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఆమెపై అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత జీవితం గురించే కాదు కెరీర్‌పై కూడా వినిపిస్తున్న ఈ రూమర్స్ తనపై ప్రభావం చూపించాయని ఇటీవల ఓ ఇంటర్య్వూలో తెలిపింది. ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉందని అంటోంది.