అమితాబ్‌ బచ్చన్‌ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 50 ఏళ్లు

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 15, 2019, 07:10 PM

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 50 ఏళ్లు పూర్తికావొస్తోంది. ఈ సందర్భంగా ఆయన కుటుంబీకులు, అభిమానులు బచ్చన్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రిని ఉద్దేశిస్తూ అభిషేక్‌ పెట్టిన పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరంగా మారింది. అమితాబ్‌ ఫొటోతో డిజైన్‌ చేసిన చొక్కాను ధరించి  ఆ ఫొటోను అభిషేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.‘ఐకాన్‌.. ఆయన నాకు అంతకంటే ఎక్కువ. నా తండ్రి, బెస్ట్‌ ఫ్రెండ్‌, గైడ్‌, బెస్ట్‌ క్రిటిక్‌, హీరో. 50 ఏళ్ల క్రితం సరిగ్గా ఈరోజు ఆయన తన సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈరోజుకి కూడా పని పట్ల తనకున్న ఆసక్తి, ప్రేమ, నిబద్ధత ఏమాత్రం తగ్గలేదు.
నాన్నా.. ఈరోజు మేం నీకున్న టాలెంట్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం. నీకోసం మరో 50 ఏళ్లు ఏం రాసిపెట్టుందో తెలుసుకోవడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఈరోజు ఆయన నాకు నేర్పిన మంచి విషయం ఏంటంటే.. ఆయనకు విష్‌ చేద్దామని తన గదికి వెళ్లాను. ఉదయాన్నే ఎక్కడికి వెళ్లడానికి తయారవుతున్నారు నాన్నా.. అని అడిగాను. అందుకు ఆయన ‘పనిచేయడానికి’ అని సమాధానం ఇచ్చారు’ అని పేర్కొన్నారు అభిషేక్‌.1969 ఫిబ్రవరి 15న అమితాబ్‌ నటించిన ‘సాథ్‌ హిందుస్థానీ’ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఆ తర్వాత ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో నటించి సినీ చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు బిగ్‌బి. ఓ నటుడిగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ బాలీవుడ్‌ మెగాస్టార్‌గా పేరు తెచ్చుకుని ఎందరో నటీనటులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ ఇప్పటికీ ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అమితాబ్‌ ‘బ్రహ్మాస్త్ర’, ‘బద్లా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Recent Post