మరో ఐటమ్‌ సాంగ్‌ లో మిల్క్‌బ్యూటి

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 16, 2019, 10:57 AM

ఓ వైపు హీరోయిన్‌గా అవకాశాలను అందిపుచ్చు కుంటూనే… ఐటమ్‌ సాంగ్‌లలో సందడి చేస్తోంది మిల్క్‌బ్యూటి తమన్నా. గతంలో జై లవకుశ చిత్రం కోసం స్వింగ్‌ జర…అంటూ ఆమె నర్తించిన ప్రత్యేక గీతం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలాగే అల్లుడు శీను చిత్రంలో లబ్బర్‌ బొమ్మ…అంటూ ఆమె చేసిన నృత్యం ప్రేక్షకులను ఓలలాడించింది. ఇంకా జాగ్వార్‌, స్పీడున్నోడు, ఈ మధ్యనే వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం కె.జి.ఎఫ్‌. లోనూ తమన్నా చేసిన ప్రత్యేక గీతాలు ఎంతో హైలైట్‌గా నిలిచాయి. దీంతో ఐటమ్‌ సాంగ్‌ అనగానే ఠక్కున సినీ జీవులకు తమన్నా గుర్తొచ్చేస్తోందని పరిశ్రమలో అంటున్నారు.


ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా డైమండ్‌ రత్నం దర్శకత్వంలో బుర్రకథ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ముంబాయికి చెందిన కిక్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నైరా షా, మిస్తీచక్రవర్తి నాయికలుగా నటిస్తున్నారు. శ్రీకాంత్‌ దీపాల నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో తమన్నా ఐటమ్‌ సాంగ్‌ ఉంటే బావుంటుందని చిత్రబృందం భావించిందట. దానివల్ల సినిమాకు మార్కెట్‌లో మంచి మైలేజ్‌ వస్తుందని అనుకుని తమన్నాను ఐటమ్‌ సాంగ్‌కు ఎంపిక చేసినట్లు పరిశ్రమలో వినిపిస్తోంది. ఇదిలావుండగా…తెలుగు, తమిళ సినీరంగాలను చుట్టేస్తూ బాలీవుడ్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉన్న తమన్నాకు ఇటీవల వచ్చిన ఎఫ్‌-2 చిత్రం మంచి విజయాన్ని అందించింది. అంతేకాదు అందులో నటనకు మంచి మార్కులు పడటంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. తాను ఐటమ్‌ సాంగ్‌ చేసిన కె.జి.ఎఫ్‌. చిత్రం కూడా భారీ విజయం సాధించడం కూడా తమన్నాలో నూతనోత్సాహాన్ని నింపిందని అంటున్నారు. ఇప్పుడు తెలుగులో దటీజ్‌ మహాలక్ష్మి, సైరా నరసింహారెడ్డి చిత్రాలను, తమిళంలో ప్రభుదేవా సరసన దేవి-2, ఉదయనిధి స్టాలిన్‌ సరసన కన్నె కాలైమానె చిత్రాలను ఆమె చేస్తోంది.
Recent Post