పెళ్లి పేరుతో ఆర్య మిస్సయ్యాడు..!

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 16, 2019, 06:58 PM

కోలీవుడ్‌లో ప్లేబోయ్‌ ఇమేజ్‌తో పాటు మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌గా ఆర్యకి ఎంతో పేరుంది. కండలు తిరిగిన శరీరంతో, ఆజానుబాహుడుగా ఉండే ఆయన ఎంతో కాలంగా తనికి మంచి జోడీ కావాలని, పేదింటి అమ్మాయైనా ఫర్వాలేదని చెప్పాడు. ఇక ‘స్వయంవరం’ వంటి టివీ షో కోసం ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన తనకి మంచి అమ్మాయి కావాలని కోరడం, దానికి అల్లుశిరీష్‌తో పాటు పలువురు కోలీవుడ్‌ ప్రముఖులు తమాషాగా స్పందించిన విషయం తెలిసిందే. కాగా ఆర్య ఈమధ్య ‘అఖిల్‌’ సినిమా ఫేమ్‌ సాయేషా సైగల్‌తో ఎఫైర్‌ నడుపుతున్నాడని, ఆమెని వివాహం చేసుకోనున్నాడని వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ దీనిపై వీరిద్దరు నోరు మెదపలేదు. తాజాగా వాలంటైన్స్‌డే సందర్భంగా ఆర్య త్వరలో తాను సాయేషా సైగల్‌ని వివాహం చేసుకోనున్నానని, పెద్దలు, బంధువులు, మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతూ అఫీషియల్‌గా దీనిని కన్‌ఫర్మ్‌ చేశాడు. సాయేషా సైగల్‌ ప్రముఖ బాలీవుడ్‌ సినీ జంట దిలీప్‌కుమార్‌-సైరా భానుల మనవరాలు అన్న విషయం తెలిసిందే. ఇక ఆర్య, అల్లుఅర్జున్‌ నటించిన ‘వరుడు’లో విలన్‌గా, డబ్బింగ్‌ చిత్రాలైన అనుష్క-సెల్వరాఘవన్‌ ‘వర్ణ’, అట్లీ దర్శకత్వంలో నయనతారతో కలిసి నటించిన ‘రాజు-రాణి’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.
ఇక వీరి వివాహాన్ని ఆర్య కంటే ముందే ఆయన స్నేహితుడు, తమిళ స్టార్‌ కార్తి రివీల్‌ చేశాడు. ఆయన మాట్లాడుతూ, ఆర్య నాకు చెప్పకుండా పెళ్లి చేసుకోడు. అయినా ప్రస్తుతం ఆర్య నా మాట వినడం లేదు. కేవలం ఆమె ఒక్క మాటే వింటున్నాడు.. అంటూ జోక్‌ పేల్చాడు. మరోవైపు మరో కోలీవుడ్‌ యంగ్‌స్టార్‌ విశాల్‌ కూడా త్వరలో ఒక ఇంటి వాడు కానున్నాడు. హైదరాబాద్‌కి చెందిన యువతిని ఆయన వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. వారు తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలను కూడా పోస్ట్‌ చేస్తున్నారు. ఆర్య-సాయేషాల వివాహం మార్చిలో జరగనుండగా, విశాల్‌ వివాహం ఎప్పుడో తెలియాల్సివుంది.
శంకర్‌ తాను తీస్తున్న ‘భారతీయుడు 2’లో మొదట శింబు, తర్వాత సిద్దార్ద్‌లతో ఓ పాత్ర చేయించాలని భావించాడు. కానీ మధ్యలో ఆర్య పేరు వినిపించింది. కానీ ఆర్య ప్రస్తుతం పెళ్లి మూడ్‌లో ఉండటం వల్ల సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో దర్శకుడు శంకర్‌ ఈ కీలకపాత్రకు మరోసారి సిద్దార్ద్‌ని ఎంపిక చేశాడని కోలీవుడ్‌ మీడియా అంటోంది. 


 


 


 
Recent Post