ఫలక్‌నుమా దాస్..విడుదలకి సిద్ధం

  Written by : Suryaa Desk Updated: Sun, May 19, 2019, 04:14 PM

ఫలక్‌నుమా దాస్.. ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతున్న సినిమా. రెండు నెలల కిందటి వరకు ఈ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి కూడా జనాలకు తెలియదు. కానీ చడీచప్పుడు లేకుండా సినిమా మొదలుపెట్టి.. షూటింగ్ అవగొట్టి టీజర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఆ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘వెళ్ళిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల్లో హీరోగా నటించిన విశ్వక్సేన్ తనే కథానాయకుడిగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రమిది. మలయాళ హిట్ మూవీ ‘అంగామలై డైరీస్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రీమేక్ అయినప్పటికీ హైదరాబాద్ పాతబస్తీ నేటివిటీతో ఈ సినిమాకు ఒక కొత్త లుక్ తీసుకురాగలిగాడు విశ్వక్సేన్.

టీజర్లోని బూతులు యువతలో చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేస్తే అది కూడా ఆకట్టుకుంది. ఇందులోనూ బూతులకు లోటు లేదు. ఐతే అవేదో ఆకర్షణ కోసం అని కాకుండా.. పాతబస్తీ నేటివిటీని వాస్తవికంగా చూపించే క్రమంలో పెట్టినవి అన్నది ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి ‘ఫలక్ నుమా దాస్’ టీజర్, ట్రైలర్ యువతలో సినిమాకు మంచి క్రే్జ్ తీసుకొచ్చాయి. బడ్జెట్, కాస్టింగ్ పరంగా చిన్న సినిమానే అయినా.. దీని క్రేజ్ చూస్తుంటే పెద్ద విజయమే సాధించేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. మే 31న విడులద చేయబోతున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. ‘ఫలక్ నుమా దాస్’ను ఆ సంస్థే కొంచెం పెద్ద స్థాయిలో రిలీజ్ చేయబోతోంది. మరి ‘పెళ్ళిచూపులు’, ‘హుషారు’ తరహాలో ఈ చిన్న చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుందేమో చూడాలి.
Recent Post