మంచి మిత్రుడు మన మధ్య లేడంటే నమ్మలేకపోతున్నా: కోట శ్రీనివాసరావు

  Written by : Suryaa Desk Updated: Sun, May 19, 2019, 05:45 PM

టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్లపల్లి మరణంతో సినీ ప్రముఖులు విషాదంలో కూరుకుపోయారు. ఆయనతో ఎంతో అనుబంధం ఉన్న కోట శ్రీనివాసరావు కూడా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. రాళ్లపల్లితో తనది 40 ఏళ్ల అనుబంధం అని, ఇద్దరి మధ్య దూరపు చుట్టరికం కూడా ఉందని వెల్లడించారు. అంతకుమించి మంచి స్నేహితుడని కోట తెలిపారు. ఆయన రాసిన మళ్లీ పాత పాటే నాటకంలో తాను కూడా నటించానని, ఆ నాటకంతో ఎంతో పేరొచ్చిందని గుర్తుచేసుకున్నారు.

తనతో పాటు ఇతరులు కూడా బాగా బతకాలి అనుకునే సహృదయుడు రాళ్లపల్లి అని, ఇద్దరు కుమార్తెల్లో ఒకమ్మాయి చనిపోయినప్పటినుంచి ఆయన ఎంతో కుంగిపోయారని వెల్లడించారు. ఒక మంచి మిత్రుడు మన మధ్య లేడంటే నమ్మలేకపోతున్నానని కోట విచారం వ్యక్తం చేశారు. కాగా, రాళ్లపల్లి కుమార్తె రష్యాలో వైద్య విద్య అభ్యసించడానికి వెళుతూ తీవ్ర జ్వరంతో విమానంలోనే మృతిచెందారు. ఏ విమానంలో అయితే రష్యా వెళ్లేందుకు ఎక్కారో అదే విమానంలో విగతజీవురాలై తిరిగొచ్చారు.
Recent Post