'కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌' షూటింగ్‌ పూర్తి

  Written by : Suryaa Desk Updated: Tue, May 21, 2019, 02:03 AM

నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి..ది క్రికెటర్‌'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.


ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామరావు మాట్లాడుతూ ''తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం, వాత్సల్యాన్ని చాటి చెప్పే సినిమా ఇది. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌ ఈ సినిమాలో ఉన్న నావెల్టీ. ఫిమేల్‌ క్రికెటర్‌గా ఐశ్వర్యా రాజేష్‌ ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది అనేది ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తం. ఒక మంచి కథతో, పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. నటుడు రాజేష్‌ కుమార్తె, హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు అయిన ఐశర్యారాజేష్‌ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటించింది. ఐశ్వరా రాజేష్‌ తమిళ్‌, మలయాళ సినిమాలు చేసినా ఫిమేల్‌ క్రికెటర్‌గా మెయిన్‌ రోల్‌తో తెలుగులో ఎంటర్‌ అవుతోంది. అలాగే మా వైజాగ్‌ రాజుగారి అబ్బాయి కార్తీక్‌ రాజు హీరోగా చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్‌గారిది ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్‌ రోల్‌. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్‌ చేసిన ఆయనకు ఇది మరో గొప్ప క్యారెక్టర్‌ అవుతుంది. వెన్నెల కిషోర్‌ ఎస్‌.ఐ.గా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండే క్యారెక్టర్‌ చేస్తున్నాడు. మా బేనర్‌లో మరో మంచి కథా చిత్రమిది. షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. జూన్‌ మూడోవారంలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.




Recent Post