మే 31న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల : రామ్ గోపాల్ వర్మ

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 03:13 PM

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. తెలంగాణలో ఎప్పుడో రెండు నెలల కిందటే విడుదలైపోయిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకు నోచుకోని సంగతి తెలిసిందే. అక్కడ రిలీజ్ కోసం చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు రామ్ గోపాల్ వర్మ. ఆ మధ్య ఒక రోజు కొన్ని థియేటర్లలో షోలు కూడా పడ్డాయి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం, ఈసీ కలిసి సినిమాను అడ్డుకున్నాయి. థియేటర్ల నుంచి సినిమాను లేపించేశాయి. దీంతో చేసేది ఏమీ లేక మిన్నకుండిపోయాడు. తన టైం కోసం ఎదురు చూశాడు. ఆ టైం రానే వచ్చింది. మొన్నటి ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ మట్టికొట్టుకుపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాడు. త్వరలోనే జగన్ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కబోతున్నాడు. ఇక వర్మ ఆనందానికి అవధులేముంటాయి?

ఇదే అదనుగా భావించి చంద్రబాబును ట్విట్టర్ ద్వారా ఒక ఆట ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడు వర్మ. తన సినిమా విడుదల కానివ్వకపోవడమే కాక.. చంద్రబాబు తనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడని భావిస్తున్న చంద్రబాబుపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నాడు. ఆ మధ్య విజయవాడలో తనను ప్రెస్ మీట్ పెట్టనివ్వకుండా అడ్డుకున్నారని.. కానీ అప్పుడు ఎక్కడైతే పెడతానని అన్నానో.. అక్కడే మళ్లీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నానని.. దమ్ముంటే అడ్డుకోండని తెలుగుదేశం నాయకులకు సవాలు విసిరాడు వర్మ. ఇదిలాా ఉంటే.. ఎట్టకేలకు ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు సన్నాహాలు కూడా జరిగిపోయాయి. మే 31న ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేయబోతున్నారు. కానీ ఏపీ జనాలు ఆల్రెడీ పైరసీ సహా అనేక మార్గాల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసేశారు. చంద్రబాబు ఇప్పుడు చచ్చిన పాము కాబట్టి.. ఆయన వ్యతిరేకులు కూడా సినిమా పట్ల అంత ఆసక్తి ప్రదర్శించకపోవచ్చు. కాకపోతే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం ద్వారా వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డి తమ పంతం నెగ్గించుకోవాలని మాత్రం చూస్తున్నారు.
Recent Post