వైసీపీ చీఫ్ జగన్ కి డైరెక్టర్ పూరి జగన్నాథ్ శుభాకాంక్షలు!

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 08:13 PM

ఏపీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన వైసీపీ చీఫ్ జగన్ కి డైరెక్టర్ పూరి జగన్నాథ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో జగన్ ని ప్రశంసలతో ముంచెత్తారు. నేను, నా కుటుంబం జగన్ కి రుణపడి ఉంటామని పూరి జగన్నాథ్ చెప్పారు.  జగన్‌ వల్లే తన తమ్ముడు ఉమాశంకర్‌ గణేశ్‌ విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాడని పూరి చెప్పారు. తన తమ్ముడు ఉమాశంకర్‌ గణేశ్‌ గెలవడం చాలా కష్టం అనుకున్నట్టు పూరి చెప్పారు. కానీ ఊహించని విధంగా వార్‌ వన్‌సైడ్‌ అయిపోయేసరికి మతిపోయిందన్నారు. ఏపీలో ప్రజలంతా రహస్యంగా మీటింగ్‌ పెట్టుకుని జగన్‌కే ఓటేద్దామనుకున్నారేమో అని అనిపించిందన్నారు. ఇన్ని కోట్ల మంది ఒకేసారి ఒక మనిషిని నమ్మడం, అతను వాళ్ల నాయకుడు కావాలని కోరుకోవడం చిన్న విషయం కాదన్నారు.
జగన్‌ కి పూరి హ్యాట్సాఫ్‌ చెప్పారు. తండ్రి రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ ఒంటరివాడయ్యారని, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలను తట్టుకుంటూ శక్తిని కూడగట్టుకుని ఈ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించారని చెప్పారు. జగన్ ముఖంలో విజయ గర్వం, పొగరు లేవన్నారు. జగన్ రాజన్న కొడుకు అనిపించుకున్నారని కితాబిచ్చారు.
2014 ఎన్నికల్లో తన తమ్ముడు ఓడిపోయినా, మళ్లీ భుజం తట్టి, చెయ్యి పట్టుకుని యుద్ధంలోకి లాక్కెళ్లి ఇంతటి విజయాన్ని అందించిన జగన్‌కు నేను, నా కుటుంబం రుణపడి ఉంటాము అని పూరి చెప్పారు. తాను రాజకీయాల్లో లేనన్న పూరి.. తనకు యోధులంటే ఇష్టం అన్నారు. జగన్‌ సింహంలా కనిపిస్తున్నారు అని చెప్పారు.


 
Recent Post