యువ హీరోలు డూప్ లేకుండా యాక్షన్ సీన్లలో నటిస్తుండటంతో గాయాలు పాలు కావడం, ఆసుపత్రిలో చికిత్స పొందడం కామన్ అయ్యింది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య విశాఖపట్నంలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్లో యాక్షన్ సన్నివేశాలలో డూప్ లేకుండా చేసి తీవ్ర గాయాల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఐరా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా షూటింగ్లో భాగంగా హీరో నాగశౌర్య రోప్, డూప్ లేకుండా గా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నాడు. ‘కేజీఎఫ్’ ఫేమ్ అంభరివ్ మాస్టర్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్స్ ని షూట్ చేస్తుండగా హీరో నాగ శౌర్య కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపడంతో 15 అంతస్థుల బిల్డింగ్ మీద నుంచి కింద పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందని చిత్ర యూనిట్ తెలిపింది. నాగ శౌర్య నడవలేని పరిస్థితిలో ఉండడంతో సినిమా షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసి స్ధానిక ఆసుపత్రికి తరలించారు.