పెళ్లి మండపం నుంచి పారిపోయి షూటింగ్ స్పాట్‌కు!

  Written by : Suryaa Desk Updated: Tue, Jun 18, 2019, 07:00 PM

అప్పట్లో హీరో తరుణ్ మంచి ఫామ్‌లో వుండగా ఆయన కోసం అమ్మాయిలు పడిచచ్చేవాళ్లు. ఒక సందర్భంలో ఏపీ నుంచి ఓ అమ్మాయి తరుణ్ కోసం హైదరాబాద్ వచ్చింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అలాంటి అనుభవమే బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సేకు ఎదురైంది. ‘ఛపాక్’ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ వధువు పెళ్లి మండపం నుంచి పారిపోయి షూటింగ్ స్పాట్‌కు వెళ్లింది. జూన్‌ 6న ఢిల్లీలోని సకెట్‌ ప్రాంతంలో షూటింగ్‌ జరుగుతోంది. ఇంతలో ఓ నవ వధువు అక్కడికి వచ్చి నానా అల్లరి చేసింది. విక్రాంత్‌ను కలవాలని గోల చేసింది. అక్కడున్న సెక్యూరిటీ ఆమెను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆమె ఏడుపు అందుకుంది. షూటింగ్‌ జరుగుతుండడంతో ఇప్పుడు కుదరదని చిత్రబృందం ఆమెకు నచ్చజెప్పింది. అయినా ఆమె వినిపించుకోలేదు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అరిచింది. ఇక చేసేదేంలేక విక్రాంత్ వెళ్లి ఆమెను కలిశాడు. తన కోసం పెళ్లిని వద్దనుకుని వచ్చానని చెప్పింది. విక్రాంత్ ఆమెకు అన్నీ విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, ఆమె అక్కడినుంచి కదలనంది. దీంతో చిత్ర యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేయక తప్పలేదు.
పోలీసులు వచ్చి ఆమెను అక్కడినుంచి తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఈ గొడవ కారణంగా షూటింగ్‌కు నాలుగు గంటల అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో తనకు ఎలా స్పందించాలో తెలియలేదని విక్రాంత్ పేర్కొన్నాడు. దీపిక పడుకొనె, విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఢిల్లీకి చెందిన యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Recent Post