పాత్ర ప్ర‌భావం బ‌లంగా ఉండాలి : నివేథా థామ‌స్

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 26, 2019, 11:44 AM

సమాజంలోని తొంభై తొమ్మిది శాతం అమ్మాయిలను ప్రతిబింబించేవిధంగా బ్రోచేవారెవరురా చిత్రంలోని తన పాత్ర ఉంటుందని నివేదాథామస్‌ చెప్పుకొచ్చారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, నివేదాథామస్‌, నివేదా పెతురాజ్‌ ప్రధాన పాత్రధారులుగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.


ఈ సందర్భంగా పాత్రికేయులతో నివేదాథామస్‌ కొద్దిసేపు ముచ్చటించారు. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే… ఇందులో నా పాత్ర పేరు మిత్ర. క్లాసికల్‌ డాన్సర్‌గా పేరు తెచ్చుకోవాలన్న అమ్మాయిగా కనిపిస్తాను. చిన్నప్పుడు క్లాసికల్‌ డాన్స్‌ నేర్చుకోవడం వల్ల ఇలాంటి పాత్రలో నటించడం చాలా సులువైంది. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అంశాలతో పాటు మహిళలపై జరుగుతున్న వేధింపులను చూపించే చిత్రమిది. తండ్రీకూతుళ్ళ మధ్య అనుబంధాన్ని, సంఘర్షణను ఇందులో ఎంతోబాగా ఆవిష్కరించారు. వాస్తవానికి అందరికీ తెలిసిన కథగా అనిపించినప్పటికీ సినిమాలో చూసినపుడు అది ఎంతగానో అందరినీ ఆకట్టుకుంటుంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ఆర్‌-3 బ్యాచ్‌గా కనిపిస్తారు. వారితో మిత్ర అనుబంధం కూడా హత్తుకుంటుంది. నిజజీవితంలో ఇలాంటి ఓ బ్యాచ్‌ ఉంటే చాలా బావుంటుందని నాకు అనిపించింది. ఇందులో ఎవరు ఎవరిని కాపాడారన్న అంశాన్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. వివేక్‌ ఆత్రేయ తెలివైన దర్శకుడు. నవతరం దర్శకులలో ఓ మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు. అతను ఈ చిత్రాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు అని నివేద అన్నారు.
Recent Post