సెంటిమెంట్ల మధ్య సుజీత్ అదృష్టం ఎలా ఉండబోతుందో !

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 09:28 PM

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డులు క్రియేట్ చేసింది సాహో. ఇదిలా ఉంటే సుజీత్‌కు ఇది రెండో సినిమా.
శర్వానంద్‌తో ‘రన్ రాజా రన్’ అనే చిత్రాన్ని తీసి హిట్ కొట్టిన సుజీత్.. రెండో సినిమాకు ఏకంగా ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని కొట్టేశాడు. నిజానికి చెప్పాలంటే ఈ చిత్రం ఎప్పుడో తెరకెక్కి ఉండాల్సింది. అయితే ‘బాహుబలి’ కోసం ప్రభాస్ దాదాపు ఐదేళ్లు కేటాయించడంతో ఈ మూవీ కాస్త ఆలస్యమైంది. ఇక ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ క్రేజ్ పెరిగిపోవడంతో.. ఆటోమెటిక్‌గా ‘సాహో’పై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆ అంచనాలను ఏ మాత్రం తగ్గనివ్వనవ్వనని దర్శకుడు పలు సందర్భాల్లో అభిమానులకు మాటిచ్చాడు.
ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో ద్వితీయ విఘ్నం ఎప్పటి నుంచో నడుస్తోంది. మొదటి మూవీతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన దర్శకులు చాలా మంది రెండో చిత్రంతో ఢీలా పడ్డారు. ఇందులో టాప్ దర్శకులు సైతం ఉన్నారు. త్రివిక్రమ్, సుకుమార్, పూరీ జగన్నాథ్, తేజ, సురేందర్ రెడ్డి, వెంకీ అట్లూరి, సతీష్ వేగెష్న, సుధీర్ వర్మ, తరుణ్ భాస్కర్ వంటి దర్శకులు గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత రెండో సినిమాతో పరాజయం పాలయ్యారు. అయితే రాజమౌళి, కృష్ణవంశీ, కొరటాల శివ, గుణ శేఖర్, శేఖర్ కమ్ముల, బోయపాటి శ్రీను, శ్రీకాంత్ అడ్డాల, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్, చందూ మొండేటి వంటి వారు తమ ద్వితీయ విఘ్నాన్ని దాటేసి రెండోసారి కూడా మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇక మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో నటించి పెద్ద విజయాన్ని పొందిన హీరో.. ఆ తరువాత ఫ్లాప్‌ను ఎదుర్కొంటాడనే టాక్ టాలీవుడ్‌లో బలంగా ఉంది. మరి ఇన్ని సెంటిమెంట్ల మధ్య సుజీత్ అదృష్టం ఎలా ఉండబోతుందో .
ఇదిలా ఉంటే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘సాహో’లో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటించింది. చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించింది. ఇక ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 18న హైదరాబాద్‌లో జరగనుంది. 
Recent Post