గజినీ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన తమిళ్ హీరో సూర్య కు ఒకప్పుడు తెలుగులోనూ బలమైన మార్కెట్ ఉండేది. గజినీ పుణ్యమాని వచ్చిన ఇమేజ్ తో కొన్నేళ్లు మన స్టార్లకు ధీటుగా సూర్య గట్టి పోటీనే ఇచ్చాడు. కానీ గత కొంతకాలంగా ఈ కోలీవుడ్ హీరో మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్ల కారణంగా భారీ మూల్యాన్నే చెల్లించుకున్నాడు. తమిళ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ అండగా ఉంది కాబట్టి చెల్లిపోతోంది కానీ ఇక్కడ మాత్రం ఆ పప్పులేమి ఉడకటం లేదు. ఆ మధ్య వచ్చిన ఎన్జికే ఎంత దారుణ పరాజయమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా సరే సూర్య తెలుగు ప్రొడ్యూసర్లు పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపించడం లేదు. 20న రిలీజ్ కానున్న బందోబస్తు మరో ఉదాహరణగా నిలుస్తుందేమోనని భయపడుతున్నారు ఫ్యాన్స్. ఇంకో 9 రోజుల్లో విడుదల ఉన్న బందోబస్త్ కు సంబంధించి ఎలాంటి హైప్ కనిపించడం లేదు. తమిళ్ లో కాప్పన్ పేరుతో లైకా సంస్థ భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీకి అక్కడ హైప్ బాగానే ఉంది. ఎటొచ్చి సీరియస్ సబ్జెక్టు కు ఏదో మసాలా సినిమా టైటిల్ పెట్టి తెలుగులోనే ఎసరు పెడుతున్నారు. ఇది చాలదు అన్నట్టు ఇటీవలే రిలీజైన ట్రైలర్ సైతం విమర్శల పాలైంది. సరైన ఎడిటింగ్ లేక బి గ్రేడ్ తరహాలో కట్ చేశారన్న నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఇకనైనా మేల్కొని బందోబస్త్ ని కాస్త ఎక్కువగా ప్రమోట్ చేస్తే అంతో ఇంతో ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే అదే రోజు స్ట్రెయిట్ ఫైట్ చేస్తున్న వాల్మీకిని తట్టుకోవడం కష్టమే.