ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజ్ఞాతవాసి రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2018, 09:55 AM



నటీనటులు: పవన్‌కల్యాణ్‌.. బొమన్‌ ఇరానీ.. కుష్బు.. ఆది పినిశెట్టి.. కీర్తిసురేష్‌.. అను ఇమ్మాన్యుయేల్‌.. తనికెళ్ల భరణి.. మురళీ శర్మ.. రావు రమేష్‌.. వెన్నెల కిషోర్‌.. రఘుబాబు తదితరులు 
సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్‌ 
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: వి.మణికందన్‌
కళ: ఏఎస్‌ ప్రకాష్‌
దర్శకత్వం: త్రివిక్రమ్‌ 


ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పీడీవీ ప్రసాద్‌ 


నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) 


బ్యానర్‌: హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ 


విడుదల తేదీ: 10-01-2018 


కొన్ని కాంబినేషన్లకు పరిచయాలు.. ఉపోద్ఘాతాలు అక్కర్లేదు. అలాంటి వాళ్లలో పవన్‌కల్యాణ్‌-త్రివిక్రమ్‌ ముందు వరుసలో ఉంటారు. వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటేనే అంచనాలను అందుకోవడం కష్టం. ఈ విషయాన్ని ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ నిరూపించాయి. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’తో మరోసారి తమ సత్తా చాటేందుకు వచ్చారు. అంతేకాదు ఇది పవన్‌ నటించిన 25వ చిత్రం కూడా కావడం మరో విశేషం. టీజర్‌ను చూసి క్లాసికల్‌ మూవీ అనుకున్న వారికి ట్రైలర్‌లో ‘ఓ మినీ యుద్ధమే’ చూపించి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశారు. మరి సంక్రాంతి బరిలో దిగిన ‘అజ్ఞాతవాసి’ కథేంటి? పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ కొట్టిందా?


కథేంటంటే: ప్రముఖ వ్యాపారవేత్త, ఏబీ గ్రూప్‌ అధినేత గోవింద భార్గవ్‌ అలియాస్‌ విందా(బొమన్‌ఇరానీ), అతని కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేస్తారు. తనకు వారసులు లేరని అనుకోకుండా విందా భార్య ఇంద్రాణి(కుష్బు) కంపెనీ వ్యవహారాలు చూసుకునేందుకు ఓ యువకుడిని (పవన్‌కల్యాణ్‌) అస్సాం నుంచి పిలిపిస్తుంది. అతను బాలసుబ్రహ్మణ్యం పేరుతో ఏబీ గ్రూప్‌లో పర్సనల్‌ మేనేజర్‌గా చేరతాడు. కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ విందా హత్యలకు కారకులైన వారి కోసం అన్వేషిస్తుంటాడు. మరి ఆ హత్యలు చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఇందులో సీతారామ్‌(ఆది పినిశెట్టి) పాత్ర ఏంటి? అసలు అస్సాం నుంచి వచ్చింది నిజంగా బాల సుబ్రహ్మణ్యమేనా? ‘అజ్ఞాతవాసి’గా అతను ఎందుకు వచ్చాడు? బాల సుబ్రహ్మణ్యంగా వచ్చిన వ్యక్తి అభిషిక్త భార్గవ ఎలా అయ్యాడు? అతనికి విందా కుటుంబానికి సంబంధం ఏంటి?


ఎలా ఉందంటే: ‘అజ్ఞాతవాసి’ నూటికి నూరుపాళ్లు పవన్‌-త్రివిక్రమ్‌ కాంబో మూవీ. అందులో ఎలాంటి సందేహం లేదు. కార్పొరేట్‌ వ్యవహారాలు, అందులో ఒకరిపై ఒకరి ఆధిపత్య పోరు.. ఎత్తులు, పైఎత్తులు మొదలైన అంశాల చుట్టూ ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. చదరంగం లాంటి అందులో ఎవరు విజేతగా నిలిచారన్నది ఈ కథలో ప్రధాన ఎలిమెంట్‌. దర్శకుడు కథను నడిపించేందుకు పురాణ, ఇతిహాసాల్లోని అంశాలను నేపథ్యంగా తీసుకున్నాడు. ‘నకుల ధర్మం’ ప్రస్తావన అందులోని భాగమే. కూర్చునే కుర్చీ తయారవడానికి జరిగే పోరాటం గురించి తొలి సన్నివేశాల్లో కథానాయకుడు చెప్పటం బట్టి.. కథ అంతా ఒక పోరాటం దిశగా సాగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ పోరాటానికి కుటుంబ బంధాలు, పిట్ట కథల్లాంటి ప్రేమ వ్యవహారం, కొన్ని వినోద సన్నివేశాలను అతికించుకుంటూ వెళ్లాడు దర్శకుడు.


దీంతో కథను నెమ్మదిగా ప్రారంభించి విరామ సన్నివేశాలు వచ్చే సమాయానికి పలు చిక్కు ముడులను పెట్టి ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేకెత్తించాడు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. హత్యలకు కారణమెవరో తెలుసుకున్న బాల సుబ్రహ్మణ్యం వారిని ఏ విధంగా మట్టుబెట్టాడన్నది ద్వితీయార్ధం. ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. ప్రథమార్ధంలో పవన్‌ ఎంట్రీ ఆకట్టుకుంటుంది. విందాను హత్య చేసి, అతని వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చలనుకున్నది ఎవరు? అనే అంశం చుట్టూ ద్వితీయార్ధం నడిచింది. ఈ క్రమంలో కథానాయకుడు ఎదుర్కొన్న పరిస్థితులను చూపించాడు దర్శకుడు. దీంతో పాటు విందా కంపెనీలో శర్మ(మురళీశర్మ) వర్మ(రావురమేష్‌)ల పాత్రలతో హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశాడు. త్రివిక్రమ్‌ శైలి కామెడీ అందరికీ నవ్వులు పంచుతుంది. ఆయా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశాలను తనదైన మార్కు జోడించి తీర్చిదిద్దాడు త్రివిక్రమ్‌. పవన్‌ పాడిన ‘కొడకా కోటేశ్వరరావు’ నవ్వుల పువ్వులు పూయిస్తుంది.


ఎవరెలా చేశారంటే: ఇది పూర్తిగా కథానాయకుడిగా చుట్టూ తిరిగే కథ. బాలసుబ్రహ్మణ్యం, అభిషిక్త భార్గవగా పవన్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగులు, యాక్షన్‌ సన్నివేశాల్లో పవన్‌ మార్కు కనపడుతుంది. ‘స్టాలిన్‌’ తర్వాత ఖుష్బుకు మరో మంచి పాత్ర దక్కింది. ద్వితీయార్ధంలో ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. మురళీశర్మ, రావు రమేష్‌లు వినోదానికే పరిమితమయ్యారు. కథానాయికల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అయితే అందంగా కనిపించారు. ఆది పినిశెట్టి నటన పర్వాలేదనపిస్తుంది. కథానాయకుడి స్థాయికి తగ్గటు ప్రతినాయకుడి పాత్రను తీర్చిదిద్ది ఉంటే ఇంకా బాగుండేది. రాముడిలాంటి వ్యక్తిత్వం ఉన్న కథానాయకుడి పాత్ర ఎలివేట్‌ కావాలంటే రావణాసురుడి వంటి బలమైన ప్రతినాయకుడు ఉండి తీరాలి. ఆ లోటు ఇందులో కనిపిస్తుంది. ప్రతినాయకుడైన సీతారామ్‌ పాత్రను మరింత బలంగా తీర్చిదిద్ది ఉంటే అభిషిక్త భార్గవ పాత్ర ఇంకాస్త ఎలివేట్‌ అయ్యేది.


 


సాంకేతికంగా.. 


సంగీత దర్శకుడిగా తెలుగులో అనిరుధ్‌ తొలి సినిమా అయిన ‘అజ్ఞాతవాసి’ గ్రాండ్‌ లాంచ్‌ అనే చెప్పాలి. చక్కని పాటలను అందించాడు. నేపథ్య సంగీతం పర్వాలేదు. అక్కడక్కడా మెరుపులు కనిపిస్తాయి. వి.మణికందన్‌ కెమెరా పనితనం బాగుంది. పవన్‌కల్యాణ్‌ పరిచయ సన్నివేశం సినిమాకు ప్రధాన ఆకర్షణ. యాక్షన్ సన్నివేశాలను ముఖ్యంగా బల్గేరియాలో ఛేజింగ్‌ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం బాగుంది. ‘మాటల మాంత్రికుడి’గా పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్‌ మరోసారి తన మార్కును చూపించాడు. అయితే దర్శకుడి కన్నా త్రివిక్రమ్‌లోని రచయితకు ఎక్కువ మార్కులు పడతాయి. ఇక శర్మ-వర్మ సంభాషణల్లో త్రివిక్రమ్‌ శైలి హాస్యం నూటికి నూరు పాళ్లు కనిపిస్తుంది. ప్ర‌థ‌మార్ధంలో వచ్చే డైలాగుల్లో డెప్త్‌ ఉంది. ‘విచ్చలవిడిగా నరికేస్తే హింస... విచక్షణతో నరికేస్తే ధర్మం’ వంటి డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. అయితే క‌థ‌, క‌థ‌నాల‌పై మ‌రింత దృష్టి పెడితే బాగుండేది. అలాగే ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను ఇంకాస్త‌ బ‌లంగా తీర్చిదిద్ది ఉండాల్సింది. పవన్‌-త్రివిక్రమ్‌ హిట్‌ కాంబినేషన్‌ కావడంతో నిర్మాత ఎక్కడా రాజీపడలేదు. ప్రతీ సన్నివేశంలో రిచ్‌నెస్‌ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


బలాలు 


+ పవన్‌ కల్యాణ్‌ పాత్ర చిత్రీకరణ 


+ విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు 


+ ద్వితీయార్ధంలో కొన్ని హాస్య సన్నివేశాలు 


+ కొడకా కోటేశ్వరరావు పాట


బలహీనతలు 


- అక్కడక్కడా ‘అత్తారింటికి దారేది’ గుర్తుకు రావడం 


- క‌థ‌, కథనాలు బలంగా లేకపోవడం


రివ్యూ  : 3/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com