ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘కార్పొరేట్‌’లకు దీపికా పదుకోన్‌ సలహా

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 22, 2018, 10:35 AM



‘‘డిప్రెషన్‌ (కుంగుబాటు).. అదెలా ఉంటుందో నాకు తెలుసు. 2014లో నా కెరీర్‌ ఉచ్ఛస్థాయిలో ఉన్నప్పుడు నేను డిప్రెషన్‌కు గురయ్యాను. ఆ సమయంలో మా అమ్మ నాలో తేడాను గుర్తించి సరైన సమయంలో చికిత్స చేయించారు. నన్ను డిప్రెషన్‌ నుంచి బయటపడేసేందుకు మా బంధుమిత్రులు కూడా సహకరించారు’’ అని ప్రముఖ నటి దీపికాపదుకోన్‌ చెప్పారు! హైదరాబాద్‌లో జరుగుతున్న ఐటీ సదస్సులో పాల్గొన్న దీపిక.. ‘ఉద్యోగుల మానసిక స్వస్థత, బోర్డ్‌ రూమ్‌ ప్రాధాన్యత’ అనే అంశంపై మాట్లాడారు. తన ఉదాహరణ ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఉన్న ఒత్తిళ్ల వాతావరణంలో కుంగుబాటుకు గురవుతున్న ఉద్యోగలు ఆ విషయాన్ని యాజమాన్యానికి చెప్పే పరిస్థితి లేదని.. చెప్తే దయాదాక్షిణ్యం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించే వాతావరణం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.


 అలాంటివారి పట్ల సానుభూతితో వ్యవహరించి దాన్నుంచి బయటపడేందుకు వారికి సహకరించాలని కార్పొరేట్‌ సంస్థల యాజమాన్యాలకు ఆమె సూచించారు. వారిని ఆ స్థితి నుంచి బయటకు తీసుకురాగలిగితే వారు తిరిగి పూర్తి సామర్థ్యాలతో పని చేయగలుగుతారని స్పష్టం చేశారు. ఇందుకోసం కార్పొరేట్‌ సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ‘మీరు ఏకాకి కాదు’ అని చెప్పి వారికి భరోసా అందించాలని సూచించారు. తాను డిప్రెషన్‌ నుంచి బయటపడగానే.. సమాజంలో ఈసమస్యను ఎదుర్కొంటున్న ఇతరుల కోసం తన వంతుగా ఏదైనా చేయాలన్న ఆలోచన కలిగి ‘‘లివ్‌ లవ్‌ అండ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌’’ ఏర్పాటు చేశానని ఆమె తెలిపారు. కాగా.. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కాలంతో పోటీపడితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఉద్యోగాలు చేసుకోవచ్చని సదస్సులో పాల్గొన్న ఐటీ నిపుణులు అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ, స్మార్ట్‌ నగరాల అభివృద్ధి అంశాలపై చర్చలతో సందడిగా సాగిన ఈ సదస్సు బుధవారం ముగిసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com