ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘జంబ లకిడి పంబ’ సినిమా రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 22, 2018, 03:08 PM



చిత్రాలలో ఈవీవీ వి‘చిత్రాలు’ వేరయా..! అని చెప్పడానికి ‘జంబ లకిడి పంబ’ సినిమా ఒక్కటి చాలు. 1993లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. అదో సెల్యులాయిడ్ చమత్కారం. అలాంటి సినిమా మళ్లీ ఇప్పటి దాకా రాలేదు, రాదు కూడా. ఇదే విషయాన్ని తాజాగా దర్శకుడు జె.బి.మురళీకృష్ణ నిరూపించారు. హాస్య నటుడు శ్రీనివాసరెడ్డిని హీరోగా పెట్టి ఆయన తెరకెక్కించిన చిత్రం ‘జంబ లకిడి పంబ’. పాత టైటిల్‌ను వాడుకున్నా ఆ కథ, ఈ కొత్త సినిమాకి ఎలాంటి సంబంధంలేదని చెప్పకనే చెప్పారు. ట్రైలర్లు, ప్రోమోలు చూసిన ప్రేక్షకులు ఇంకొంచెం కొత్తగా ఉంటుందేమో అని ఊహించారు. ఇంతకీ సినిమాలో కొత్తదనం ఏమైనా ఉందా..? చూద్దాం.. 


వరుణ్ (శ్రీనివాసరెడ్డి), పల్లవి (సిద్ధి ఇద్నాని) ప్రేమించుకుంటారు. ఇంట్లో పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకుంటారు. వరుణ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పల్లవి కాస్ట్యూమ్ డిజైనర్. సొంతంగా బొటిక్ నడుపుతుంది. పెళ్లైన కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు మొదలవుతాయి. వరుణ్‌కు తనతోపాటు పనిచేసే దివ్యతో సంబంధం ఉందని పల్లవి అనుమానిస్తుంది. విడిపోదాం అనుకుంటారు. వీరికి విడాకులు ఇప్పించేందుకు హరిశ్చంద్ర ప్రసాద్ (పోసాని) ఒప్పుకుంటారు. కానీ అనుకోకుండా ఆ లాయర్ యాక్సిడెంట్‌లో చనిపోతారు. మరి ఆ తరువాత ఏమైంది? వరుణ్, పల్లవి ఎలా కలుసుకున్నారు? వీళ్ల మధ్య ‘జంబ లకిడి పంబ’ పాత్ర ఏమిటి? అనేది అసలు ట్విస్టు. 


ఎలా ఉందంటే.. 


స్త్రీ పురుషుడిలా, పురుషుడు స్త్రీలా మారడమే ‘జంబలకిడిపంబ’ అని ఈవీవీ చూపించారు. ఆ కాన్సెప్ట్‌ను దర్శకుడు జె.బి.మురళీకృష్ణ ఈ సినిమాకు వాడుకున్నారు. రొటీన్ మూస కథకు ‘జంబ లకిడి పంబ’ అనే టాగ్‌ను తగిలించి ప్రేక్షకులపై రుద్దే ప్రయత్నం చేశారు. పాత ‘జంబలకిడిపంబ’కు ఈ కొత్త సినిమా ఏ అంశంలోనూ పోటీ పడలేదు. ఒక చిత్రాన్ని మరో సినిమాతో పోల్చకూడదని చాలా మంది అంటుంటారు. కానీ ఇక్కడ పోల్చక తప్పదు. ఎందుకంటే కథ ఏదైనా ‘జంబ లకిడి పంబ’ కాన్సెప్టే ఇక్కడ ముఖ్యం. దాన్ని ఎంత బాగా వాడారనే దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. కానీ దర్శకుడు ఆ కాన్సెప్ట్ సరిగా వాడలేకపోయారనే చెప్పాలి. 


పాత ‘జంబ లకిడి పంబ’లో అన్ని పాత్రలు అటు ఇటుగా మారిపోతాయి. దీంతో హాస్యం బాగా పండింది. కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం లాంటి హేమాహేమీలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కానీ ఈ కొత్త సినిమాలో హీరోహీరోయిన్లు మాత్రమే అటు ఇటుగా మారతారు. దీనివల్ల కామెడీకి పెద్ద స్కోప్ లేకుండా పోయింది. శ్రీనివాసరెడ్డి సహా పోసాని, వెన్నెల కిషోర్, రఘుబాబు, సత్యం రాజేష్, ధనరాజ్ లాంటి మంచి హాస్యనటులు ఉన్నా దర్శకుడు పెద్దగా వాడుకోలేకపోయారు. వీళ్లు చేసిన కామెడీ ప్రేక్షకుడిని పెద్దగా నవ్వించకపోగా విసుగు పుట్టిస్తుంది. 


సినిమా మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు గొప్పగా చెప్పుకోవడానికి ఒక్క మంచి సన్నివేశం లేదు. వరుణ్ పనిచేసే ఐటీ కంపెనీలో డ్యాన్సులు, తెల్లని షూట్‌లో సుమన్ దేవుడి అవతారం, గ్రామీణ నేపథ్య సన్నివేశాలు, ప్రారంభం నుంచి చివరి వరకు సాగే పోసాని పాత్ర ప్రేక్షకుడికి కాస్త విసుగు తెప్పిస్తాయి.


ఎవరెలా చేశారంటే.. 


99 మందికి విడాకులు ఇప్పించి గిన్నిస్ బుక్‌లో రికార్డు కోసం 100వ జంటకు కూడా విడాకులు ఇప్పించాలని తాపత్రయపడే లాయర్ పాత్రలో పోసాని నటన బాగుంది. భార్యభర్తలను కలిపే ఆత్మగా హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశారు. హీరో శ్రీనివాసరెడ్డి ఎప్పటిలానే తన పాత్రలో ఒదిగిపోయారు. అమ్మాయి హావభావాలను బాగానే పండించారు. అయితే ఆయన హాస్యరసాన్ని పండించేలా స్క్రిప్టు లేకపోవడం బాధాకరం. సిద్ధి ఇద్నాని తన పాత్రకు న్యాయం చేసింది. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌లో మగరాయుడిలా దుమ్ముదులిపింది. వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, తనికెళ్ల భరణి, రఘుబాబు, హరితేజ తమ పాత్రల్లో బాగా నటించారు. షకలక శంకర్, జయప్రకాశ్ రెడ్డి పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. ఐటమ్ సాంగ్‌లో హాస్యనటుడు అలీ ఎంట్రీ ఎందుకో అర్థంకాని విషయం. 


 


సాంకేతిక విభాగం.. 


సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. తక్కువ బడ్జెట్లో మంచి ఔట్‌పుట్ ఇచ్చారు. దర్శకుడిగా పెద్దగా మెప్పించలేకపోయిన మురళీకృష్ణ.. రచయితగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మాస్ ప్రేక్షకుల కోసం అక్కడక్కడ మసాలా డైలాగులు తగిలించారు. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు గోపీ సుందర్ గురించి. ఆయన అందించిన పాటలు బాగున్నాయి. మాస్ ఆడియన్స్ కోసం పెట్టిన ఐటమ్ సాంగ్ కూడా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌లో గోపీ అందించిన నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఈయనకు మాస్ సినిమాల్లో ఇంకా అవకాశం రాలేదు కానీ.. వస్తే కుమ్మేస్తారేమో అనిపిస్తోంది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ సినిమాకు కాస్త ఊరట. సినిమా నిడివి కాస్త తగ్గించేలా ఎడిటర్ తమ్మిరాజు ప్రయత్నిస్తే బాగుండేది. 


రివ్యూ : 2.5/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com