అవును.. వినడానికి కాస్త కొత్తగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే ఓ కుర్ర హీరో టికెట్స్ అమ్ముకున్నాడు. అది కూడా తన సినిమా టికెట్సే అమ్ముకుంటున్నాడు. కౌంటర్లో ఆయన్ని చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసమే ఆయన చేసాడు. అంతగా మాయ చేసిన ఆ హీరో సందీప్ కిషన్. ఈయన నటించిన 'నిను వీడని నీడని నేనే' సినిమా మంచి టాక్ సొంతం చేసుకుని విజయం వైపుగా పరుగులు తీస్తుంది. గతవారం విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ చాలా రోజుల తర్వాత సందీప్ కోరుకున్న బ్రేక్ ఇచ్చింది.
ఇక టాక్ బాగుండటంతో సినిమాను ఎలాగైనా బతికించాలని ప్రమోషన్స్ కోసం ఊరూరూ తిరుగుతున్నాడు ఈయన. ఎంతగా అంటే ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తున్నాడు సందీప్ కిషన్. ఈ సినిమా కోసం ముందు దొంగగా మారాడు.. ఆ తర్వాత రోడ్ల మీద సైకిల్ తొక్కి ప్రేక్షకులకు తన సినిమాను చేరువ చేసాడు. ఆ వెంటనే కాలేజీలకు వెళ్లాడు.. మొన్నటికి మొన్న కాకినాడ సుబ్బయ్య హోటల్ వెళ్లి అక్కడ సర్ ప్రైజ్ చేసాడు. ఇక ఇప్పుడు కాకినాడలోని ఒక థియేటర్‌కు వచ్చిన సందీప్.. అక్కడ కౌంటర్లో కూర్చుని టికెట్స్ కూడా ఇచ్చాడు. ఇదంతా ఇప్పుడు సినిమాకు బాగానే హెల్ప్ అవుతుంది. మొత్తానికి చూడాలిక.. ఈయన చేస్తున్న ప్రమోషన్ సినిమాను ఎలా నిలబెడుతుందో..?